ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ విజయం.. టోర్నీ నుంచి హైదరాబాద్ ఔట్!

09-05-2019 Thu 06:31
  • హైదరాబాద్‌ను ఇంటికి పంపిన రిషభ్ పంత్
  • చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్
  • చెన్నైతో పోరుకు సిద్ధమవుతున్న ఢిల్లీ కేపిటల్స్

ఆరు విజయాలతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మ్యాచ్‌లో బోల్తా పడింది. హైదరాబాద్‌కు దక్కినట్టే దక్కిన విజయాన్ని ఢిల్లీ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ బలవంతంగా లాగేసుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

ఐపీఎల్‌లో భాగంగా విశాఖపట్టణంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ రెండు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించి చెన్నైతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ 36, మనీష్ పాండే 30, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 28, విజయ్ శంకర్ 25, నబీ 20 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో కీమో పాల్ మూడు వికెట్లు పడగొట్టగా ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీసుకున్నాడు. బౌల్ట్, మిశ్రా చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మరో బంతి మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. పృథ్వీషా (56) అద్భుత ప్రదర్శనకు తోడు రిషభ్ పంత్ చెలరేగడంతో ఢిల్లీకి విజయం సొంతమైంది. ఒకానొక దశలో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. ఆ సమయంలో పంత్ ఆపద్బాంధవుడిలా జట్టును ఆదుకున్నాడు. క్రీజులో పాతుకుపోయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్ వరకు నరాలు తెగే టెన్షన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో చివరికి ఒక్క బంతి మిగిలి ఉండగానే ఢిల్లీ విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ కేపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ విజేత 12న జరిగే ఫైనల్‌లో ముంబైతో తలపడుతుంది.