ashok gehlot: అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలి: జవదేకర్ డిమాండ్

  • అళ్వార్ లో దళిత మహిళపై గ్యాంగ్ రేప్
  • అశోక్  గెహ్లాట్ నైతిక బాధ్యత తీసుకోవాలన్న జవదేకర్
  • కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ డిమాండ్

అళ్వార్ లో ఒక దళిత మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ పై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కోరారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో జరిగిన ఈ సామూహిక అత్యాచారాన్ని బయటకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టిందని ఆరోపించారు. దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ ఇలా చేయడం సిగ్గుచేటని అన్నారు.

అత్యాచారం జరిగిన తర్వాత... మే 2న తన భర్తతో కలసి బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లిందని... అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని జవదేకర్ అన్నారు. మే 6న పోలింగ్ ఉండటంతో... ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దంటూ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయని ఆరోపించారు. దళితులపై కాంగ్రెస్ కు ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.

ఏప్రిల్ 30వ తేదీన రాజస్థాన్ లోని అళ్వార్ లో దళిత మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపారు. భర్తను చితకబాది... అతని కళ్ల ముందే ఆమెపై దారుణానికి ఒడిగట్టారు.

More Telugu News