Telangana: విజయశాంతికి ఫాలోయింగ్ ఉంది.. పీసీసీ చీఫ్ కావాలని అనుకుంటోందేమో!: జగ్గారెడ్డి

  • ఆమెను నేను విమర్శించబోను
  • దక్షిణాది రాష్ట్రాల్లో విజయశాంతి సేవలను పార్టీ వాడుకోవాలి
  • హైదరాబాద్ లో మీడియాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి తనను విమర్శించారనీ, ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వబోనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఓ సినిమా నటిగా విజయశాంతికి మంచి ఫాలోయింగ్ ఉందనీ, పార్టీ కోసం పనిచేస్తే ఆమెకు ఇంకా మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో ఈరోజు జగ్గారెడ్డి మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘విజయశాంతికి పీసీసీ చీఫ్‌ కావాలనే కోరిక ఉందేమో. సినీనటిగా ఆమెకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. విజయశాంతి వల్ల కాంగ్రెస్‌కు ఉపయోగమే. ఆమె సేవలను దక్షిణాది రాష్ట్రాల్లో వాడుకుంటే పార్టీకి లాభం కలుగుతుంది. పార్టీ కోసం మరింత సమయం వెచ్చిస్తే విజయశాంతికి కూడా మంచి రాజకీయ భవిష్యత్‌ ఉంటుంది’ అని అన్నారు. రాబోయే రోజుల్లో పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టేవాళ్లు ముఖ్యమంత్రి పదవిపై ఆశలు లేకుండా పార్టీ కోసం పని చేయాలని జగ్గారెడ్డి సూచించారు.

పీసీసీ పీఠం కావాలనుకునేవాళ్లు తమ సొంత ఖర్చులతో పార్టీని నడిపేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే పీసీసీకి, కాబోయే సీఎంకు మధ్య సమన్వయం ఉంటుందని తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఈ లోక్ సభ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేననీ, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని
జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్‌లు కూడా యూపీఏలో చేరడం ఖాయమన్నారు. దీనిపై విజయశాంతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళుతుందని విమర్శించారు.

More Telugu News