Andhra Pradesh: ఏపీపై ‘ఉగ్ర’ పడగ.. అత్యవసర సమావేశం ఏర్పాటుచేసిన డీజీపీ ఆర్పీ ఠాకూర్!

  • జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో భేటీ
  • మంగళగిరి నుంచి వీడియో కాన్ఫరెన్స్
  • భద్రతను కట్టుదిట్టం చేయాలని డీజీపీ ఆదేశం

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఈరోజు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలను సమీక్షించారు. ఇటీవల శ్రీలంకలో ఉగ్రదాడులు, మరోపక్క వామపక్ష తీవ్రవాదం నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయని ఆర్పీ ఠాకూర్ తెలిపారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏపీ తీరప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలనీ, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని హోటళ్లు, పర్యాటక ప్రాంతాల్లో నిఘాను పెంచాలని సూచించారు. ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి వీల్లేదనీ, అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కోసం తీసుకుంటున్న చర్యలపై కూడా డీజీపీ సమీక్ష నిర్వహించారు.

More Telugu News