Visakhapatnam District: మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు పదవీ గండం.. చట్టసభలకు ఎంపిక కాకపోవడమే కారణం

  • ఆరు నెలల్లోగా ఆయన ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కావాలి
  • ఈనెల 10వ తేదీతో ముగుస్తున్న గడువు
  • సార్వత్రిక ఎన్నికల్లో అరకు నుంచి పోటీ చేసిన శ్రావణ్

మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన అరకు ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్యం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు పదవీ గండం పొంచి ఉంది. ఆరు నెలల్లోగా ఆయన శాసన సభ, శాసన మండలిలో ఏదో ఒకదానికి ఎన్నిక కావాల్సి ఉన్నప్పటికీ, గడువులోగా ఆ పరిస్థితి లేకపోవడమే ఇందుకు కారణం.

అరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖ జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లోని డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు గ్రామం సమీపంలో గత ఏడాది సెప్టెంబర్‌ 23వ తేదీన మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన అనంతరం టీడీపీలో చేరిన సర్వేశ్వరరావు సహచర పార్టీ నాయకుడు సోమతో కలిసి గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా మార్గమధ్యలో అడ్డగించిన మావోయిస్టులు ఇద్దరినీ కాల్చి చంపేశారు. అప్పట్లో ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించగా కిడారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆ తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు  శ్రావణ్‌కు చోటు కల్పించారు.  గత ఏడాది నవంబరు 11వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేసి  వైద్య ఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగం ప్రకారం ఏ చట్ట సభలోనూ సభ్యుడు కాని మంత్రి ఆరు నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. ఈ గడువు ఈ నెల 10వ తేదీతో ముగుస్తోంది.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్‌లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి ప్రాతినిధ్యం వహించిన అరకు నుంచి టీడీపీ అభ్యర్థిగా శ్రావణ్‌ పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల ఫలితాలు ఈనెల 23వ తేదీన వెలువడనున్నాయి. ఈలోగానే ఆరు నెల గడువు ముగుస్తుండడంతో ఆయన రాజీనామా అనివార్యమని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ గవర్నర్‌ కార్యాలయం మంత్రికి సమాచారం పంపినట్లు తెలిసింది.

ఈ విషయమై శ్రావణ్‌ మాట్లాడుతూ గవర్నర్‌ నుంచి తనకు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇంకా అందలేదని, అయినా బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆయన సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

More Telugu News