CSK: కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన చెన్నై.. ఐపీఎల్ ఫైనల్లోకి రోహిత్ సేన

  • చెన్నైపై ముంబై హ్యాట్రిక్ విజయం
  • ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన ముంబై
  • రెండో క్వాలిఫైర్ మ్యాచ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న చెన్నై

లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక మ్యాచ్‌లో బోల్తా పడింది. సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది. ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ధ సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ముంబై చేతిలో ఓడిన చెన్నై రెండో క్వాలిఫైర్ మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది.  

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగుల స్వల్ప స్కోరు చేసింది. చెన్నై మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. అంబటి రాయుడు చేసిన 42 పరుగులే అత్యధికం. మురళీ విజయ్ 26, కెప్టెన్ ధోనీ 37 పరుగులు చేశారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ముంబై బౌలర్లు చెన్నైని 131 పరుగులకే కట్టడి చేశారు.

అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో 9 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(4), క్వింటన్ డికాక్ (8) నిరాశ పరిచినప్పటికీ ఫస్ట్ డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ పోరాడాడు. చెన్నై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టును విజయ పథంలో నడిపాడు. మొత్తం 54 బంతులు ఎదుర్కొన్న యాదవ్ పది ఫోర్లతో అజేయంగా 71 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 28 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 13 పరుగులు చేశాడు. దీంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయ తీరాలకు చేరి ఫైనల్లో అడుగుపెట్టింది.

ఐపీఎల్‌లో ముంబై ఫైనల్‌కు చేరడం ఇది ఐదోసారి. అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు విజయాన్ని అందించిన సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ముంబై చేతిలో ఓడిన చెన్నై రెండో క్వాలిఫైర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

More Telugu News