Amit Shah: మోదీని దుర్యోధనుడితో పోల్చడంపై ప్రియాంకపై అమిత్ షా ఆగ్రహం

  • ప్రియాంక అన్నంత మాత్రాన ఎవరూ దుర్యోధనులైపోరు
  • ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు గట్టి గుణపాఠం నేర్పుతాయి
  • ప్రియాంక వ్యాఖ్యలు కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం

హర్యానాలో ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ దుర్యోధనుడితో పోల్చడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దుర్యోధనుడికి ఎంత అహంకారం ఉందో మోదీకి కూడా అంతే అహంకారం ఉందని ప్రియాంక వ్యాఖ్యానించారు. తన తండ్రి రాజీవ్ గాంధీని 'నంబర్ 1 అవినీతిపరుడు' అని మోదీ విమర్శించడంపై ఆమె పైవిధంగా స్పందించారు.

అయితే, దీనిపై బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ లో నెలకొన్న అసహనానికి సూచికలు అని అన్నారు.

"ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని దుర్యోధనుడు అని పిలిచారు. ప్రియాంక గారూ, ఇది ప్రజాస్వామ్యం. మీరు అన్నంత మాత్రాన ఎవరూ దుర్యోధనుడు అయిపోరు. మే 23న వచ్చే ఎన్నికల ఫలితాలు మీకు గట్టి గుణపాఠం నేర్పుతాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవమానకర రాజకీయాలు చేసినా ఓటర్ల మనసు మాత్రం మార్చలేదు" అంటూ ధ్వజమెత్తారు.

More Telugu News