Telangana: అంబేద్కర్ విగ్రహం అక్కడ పెట్టాల్సిందే.. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా!: వీహెచ్ హెచ్చరిక

  • కేసీఆర్ కు ఇంటర్ పిల్లల తల్లిదండ్రులు కన్పించడం లేదా?
  • వైఎస్ విగ్రహాన్ని ఉంచి అంబేద్కర్ ది తీసేయడం ఏంటి?
  • హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత

కేరళ ముఖ్యమంత్రి విజయన్ ను కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. విజయన్ ను కలిసిన కేసీఆర్ కు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ పిల్లల తల్లిదండ్రులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేరళ పర్యటనలో సీఎం వెంట కేవలం ఆయన సామాజికవర్గం నేతలే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పంజాగుట్టలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని వీహెచ్ ప్రశ్నించారు. పంజాగుట్టలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఉంచి అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం తీసేయడం ఏంటని అడిగారు.

ఈ నెల 10 తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్టలో ప్రతిష్టించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. రేపు ధర్నా చౌక్‌లో మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతామని వీహెచ్ అన్నారు.

More Telugu News