వైఎస్ సభ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు వందల కొద్దీ బైక్ లు సీజ్ చేయించారు!: ఉండవల్లి

07-05-2019 Tue 13:19
  • 2009లో నా ఓటమికి కొందరు గట్టిగా ట్రై చేశారు
  • మురళీ మోహన్, కృష్ణంరాజును రంగంలోకి దించారు
  • విజయవాడలో ఉండవల్లి ‘మీట్ ది ప్రెస్’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మధ్య ఉన్న గొడవ ఏంటో తనకు అర్థం కావడం లేదని సీనియర్ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. తాను రాజమండ్రి లోక్ సభ సీటు నుంచి 2009లో పోటీ చేస్తున్నప్పుడు టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారని తెలిపారు.

దీంతో తన జిల్లా ఎస్పీ, డీఐజీలను బదిలీ చేశారన్నారు. పాత డీఐజీ స్థానంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావును తీసుకొచ్చి డీఐజీగా పెట్టారని గుర్తుచేసుకున్నారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఉండవల్లి మాట్లాడారు.

తనను ఎలాగైనా ఓడించాలని కొందరు శత్రువులు 2009లో చాలా తీవ్రంగా ప్రయత్నించారని ఉండవల్లి ఆరోపించారు. ‘‘నాకు వ్యతిరేకంగా ఇద్దరు యాక్టర్లను తెచ్చి పెట్టారు. అప్పటివరకూ భారతదేశ చరిత్రలో అలాంటి సంఘటన జరగలేదు. వీరిలో ఒకతను అప్పటికే కేంద్ర మంత్రిగా, ఎంపీగా చేసిన కృష్ణంరాజు.

మరోవైపు సినీనటుల్లోనే అత్యంత ధనికుడైన మురళీమోహన్ ను పోటీకి దించారు. అప్పుడు నేను ఎక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా అర్రే... కృష్ణంరాజు వచ్చాడురా అని ప్రజలు వెళ్లిపోయేవారు. ఈలోపు ఇంకోచోటుకు పోతే.. మురళీమోహన్.. మురళీమోహన్ అంటూ ప్రజలు ఆయన దగ్గరకు వెళ్లిపోయేవారు.

చివరికి సీఎం రాజశేఖరరెడ్డి రాజమండ్రిలో నాకు మద్దతుగా ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా కడియం నుంచి రాజమండ్రిలో సభావేదిక వరకూ దారిలో ఉన్న మోటార్ సైకిళ్లు, సభకు 100 మీటర్ల పరిధిలో ఉన్న బైకులు అన్నింటిని వందల కొద్దీ ఏబీ వెంకటేశ్వరరావు సీజ్ చేయించారు. ఈ సభ సందర్భంగా బైక్ లకు కాంగ్రెస్ జెండాలు లేకుండా మేమంతా ముందుగానే జాగ్రత్త పడ్డాం.

బైక్ లు సీజ్ చేయడంతో ప్రజలంతా రాజశేఖరరెడ్డి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు వైఎస్ ‘అరుణ్ కుమార్ చూసుకుంటాడులే’ అన్నారు. దీంతో నేను ‘అదేంటి సార్.. అలా చెప్పారు. నేనేం చేయగలను?’ అని అడిగా.

దానికి వైఎస్ స్పందిస్తూ.. ఏం చేయాలయ్యా.. ఎలక్షన్ కమిషన్ ఉంది. మనం ఫోన్ చేసినా ఏబీ వెంకటేశ్వరరావు వినడు. నువ్వు వెళ్లి ఆయనతో మాట్లాడు’ అని సూచించారు. చివరికి నేను వెళ్లి మాట్లాడితే తేలింది ఏమిటంటే ట్రిపుల్ రైడింగ్ చేశారు కాబట్టి వాటిని సీజ్ చేశారంట. ఏవో 3 బైకులపై ముగ్గురు వ్యక్తులు వచ్చారనీ, ఆ బైకులు ఏవో స్పష్టత లేకపోవడంతో అన్నింటిని సీజ్ చేశామని ఏబీ వెంకటేశ్వరరావు జవాబు ఇచ్చారు’’ అని ఉండవల్లి నాటి ఘటనను గుర్తుచేసుకున్నారు.