Telangana: తెలంగాణలో ‘ఇంటర్’ అన్యాయంపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తాం!: బీజేపీ నేత లక్ష్మణ్

  • టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోంది
  • గ్లోబరినాతో అశోక్ లాలూచీ పడ్డారు
  • హైదరాబాద్ లో మీడియాతో బీజేపీ నేత

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై బీజేపీ పోరాటం చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరీక్షలకు సాంకేతిక సేవలు అందించిన గ్లోబరినా సంస్థతో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ లాలూచీ పడ్డారని ఆరోపించారు.

ఈ వ్యవహారంలో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వంపై పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతామని లక్ష్మణ్ ప్రకటించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఉద్యమంలో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్న 26 మంది ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను బీజేపీ నేతలు నాలుగు బృందాలుగా ఏర్పడి పరామర్శిస్తామని తెలిపారు.

అలాగే ఈ నెల 9,10 తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, జాతీయ మానవహక్కుల కమిషన్, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ ను కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 11,12 తేదీల్లో తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ శ్రేణులు ఒక్కరోజు నిరసన దీక్ష చేపడతాయని పేర్కొన్నారు.

ఆ తర్వాత మే 15,16 తేదీల్లో ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమవుతామని చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేవరకూ తమ పోరాటాన్ని విరమించబోమని స్పష్టం చేశారు.

More Telugu News