Andhra Pradesh: టీడీపీ నేతలు తోక కాలిన కుక్కల్లాగా మొరగకుండా లేఖలో ఏముందో చదివిఉంటే బాగుండేది!: కేవీపీ ఘాటు వ్యాఖ్యలు

  • ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేను లేఖ రాశా
  • కానీ ఉమ, కొందరు పండిత పుత్రులు నన్ను విమర్శించారు
  • టీడీపీ నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత బహిరంగ లేఖ

పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను ఏపీ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తే, ఏపీ మంత్రి దేవినేని ఉమతో పాటు పోలవరంపై ఓనమాలు కూడా తెలియని పండిత పుత్రులు తనను విమర్శిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. పార్టీ హైకమాండ్ ఆదేశించగానే తోక కాలిన కుక్కల్లాగా మొరగకుండా లేఖలో ఏం ఉందో చదవి స్పందించి ఉంటే బాగుండేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కేవీపీ ఈరోజు టీడీపీ నేతలకు బహిరంగ లేఖ రాశారు.

ఈ వ్యవహారంలో నిజం మాట్లాడటం ఇష్టం లేదో లేక సబ్జెక్టుపై అవగాహన లేదో.. దేవినేని ఉమ కూడా తన లేఖలో పోలవరం ప్రాజెక్టు ఖర్చుపై వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదని కేవీపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును ఏపీ తీసుకోవడం ద్వారా ఎంత భారం రాష్ట్రంపై పడుతుందో ఉమ చెప్పలేదన్నారు. ఒకవేళ ఎలాంటి భారం పడకుంటే ఉమ దానిపై స్పష్టత ఇచ్చి ఉండేవారనీ, కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం చూస్తుంటే తాను చెప్పింది నిజమేనని ఆయన అంగీకరించినట్లేనని కేవీపీ వ్యాఖ్యానించారు.

తనపై టీడీపీ నేతలు దిగజారి అసభ్య వ్యాఖ్యలు చేశారనీ, తాను వారిలా దిగజారి మాట్లాడలేనని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకునే కోట్లాది మంది ఆంధ్రుల్లో తానూ ఒకడినని కేవీపీ అన్నారు. వైఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకురావడంలో తాను కీలకంగా పనిచేశానని వ్యాఖ్యానించారు. 

More Telugu News