Gannavaram: అందుకే నీకు సన్మానం చేయాలనుకున్నా.. భయం వద్దు, కాఫీకి రా!: యార్లగడ్డకు వల్లభనేని వంశీ వాట్సాప్ సందేశం

  • నువ్వు గన్నవరం వచ్చే వరకు మనమెప్పుడూ కలుసుకోలేదు
  • నీ నుంచి నేను అప్పు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి
  • యార్లగడ్డకు వంశీ వాట్సాప్ మెసేజ్

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మధ్య చోటుచేసుకున్న వివాదం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థలను తొలగించేందుకు వంశీ ముందుకొచ్చారు. వాట్సాప్ ద్వారా వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు, ఆయన సోదరుడు జైరమేష్‌లకు ఓ సందేశం పంపారు. అందులోని సారాంశం యథాతథంగా..

"ప్రియమైన వెంకట్రావుకు.. నేను వల్లభనేని వంశీ. పెద్దగా పరిచయం అక్కర్లేదనే అనుకుంటున్నా. కొన్ని విషయాలను నీ దృష్టికి తీసుకురావాలనే ఈ మెసేజ్. మన ఉమ్మడి స్నేహితుడు కొడాలి నాని ద్వారా పలు విషయాల్లో నీకు సాయం చేసినప్పటికీ మనిద్దరం ఎప్పుడూ కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. నాని ప్రోద్బలం వల్లే నీకు సాయం చేశా. ఈ విషయంలో నువ్వు నానికి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేస్తున్నప్పుడు కూడా మనం కలవలేదు. లక్ష్మీతిరుపతమ్మ ఆలయంలో నువ్వు కనిపించినప్పుడు మాత్రం నీకు స్వాగతం చెప్పాను.

ఆ తర్వాత ఒకసారి కేసరపల్లిలో నీ అనుచరులు కట్టిన బ్యానర్‌పై ప్రసాదంపాడు అని రాసి ఉంటే గమనించి నీకు ఫోన్ చేసి సరిచేసుకోమని చెప్పా. ఇప్పటి వరకు మూడుసార్లు పోటీ చేసిన నేను ఎక్కడా అనవసరంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు. పార్టీ గురించి, చంద్రబాబు గురించే మాట్లాడాను తప్పితే నాపై పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్‌, దుట్టా రామచంద్రరావుల గురించి ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదు. లగడపాటి పిల్లలు, మా పిల్లల మధ్య చక్కని అనుబంధం ఉంది. వారు మా ఇంటికి, మా పిల్లలు వారింటికి వెళ్తుంటారు.  

గన్నవరం వచ్చే వరకు నన్ను ఎప్పుడూ చూడని, మాట్లాడని నీ నుంచి నేను అప్పు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎప్పుడైనా నాకు అప్పు ఇచ్చావా? విరాళం ఇచ్చావా? ఇటువంటి నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతోనే నీకు ఫోన్ చేసి కలవాలనుకున్నా. అలా కలవడం నీకు ఇష్టం లేకపోతే, నువ్వే మా ఇంటికి కాఫీ తాగేందుకు రావొచ్చు. వస్తూవస్తూ  దాసరి బాలవర్థనరావుని, జైరమేష్‌ని, నీ శ్రేయోభిలాషుల్ని కూడా తీసుకురావచ్చు.

గన్నవరాన్ని డల్లాస్‌గా మారుస్తానన్న నీ ప్రతిపాదన విన్నాక నీకు సన్మానం చేయాలనిపించింది. నీకు ఫోన్ చేస్తే స్పందించకపోయే సరికి అపాయింట్‌మెంట్ కోసం నా మనుషుల్ని నీ ఇంటికి పంపా. ఆ తర్వాత నేనే వచ్చాను. అయితే, నా నుంచి నీకు ప్రాణహాని ఉందని పోలీస్ కమిషనర్‌ను కలిసినట్టు పేపర్లో చూశాను. నువ్వేమీ భయపడాల్సిన పనిలేదు. నా వల్ల నీకెలాంటి ఇబ్బంది ఉండదు. దేవుడున్నాడు.. అన్నీ ఆయనే చూసుకుంటాడు..." అని వల్లభనేని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు.

More Telugu News