Uttar Pradesh: పొలంలో కాటేసిన పాము.. కసితో పామును నమిలిమింగిన 70 ఏళ్ల వృద్ధుడు!

  • యూపీలోని మహీసాగర్ జిల్లాలో ఘటన
  • ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • 4 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిన పెద్దాయన

సాధారణంగా ఎవరినైనా పాము కరిస్తే ఏం చేస్తారు? వెంటనే ఆసుపత్రికి పరిగెత్తుతారు. కానీ ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమైన ఘటన చోటుచేసుకుంది. తనను పాము కరవడంతో ఓ పెద్దాయన(70)కు తిక్కరేగింది. దీంతో ఆ పామును పట్టుకుని నేలకేసి కొట్టి చంపేశాడు. అనంతరం దాన్ని కొరుక్కు తినేందుకు ప్రయత్నించాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహీసాగర్ జిల్లా అజన్వా గ్రామంలో పర్వాత్ గాలా బరియా(70) పొలానికి వెళ్లాడు. అక్కడే ఓ విషపూరితమైన పాము ఆయన్ను కాటేసింది. సాధారణంగా ఇంకొకరైతే వెంటనే ఆసుపత్రికి వెళ్లేవారు. అయితే బారియా మాత్రం ‘నా పొలంలో నన్నే కరుస్తావా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. చేతిలోని కర్రతో చావగొట్టాడు. నేలపై విసిరిగొట్టి చంపేశాడు.

చివరికి దాన్ని చేతుల్లోకి తీసుకుని కొంత నమిలి తిన్నాడు. అసలే పాము కరవడం, దానికితోడుగా పామును మింగేయడంతో విషం శరీరమంతా పాకింది. పాము కరిచిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవాళ్లు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో ఆయన నాలుగు గంటల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు.

More Telugu News