Supreme Court: లైంగిక వేధింపు విచారణ కేసులో ఫిర్యాదుదారునీ భాగస్వామిని చేయాలి : జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ నారీమన్‌

  • సుప్రీం కోర్టు  సీజేపై మాజీ ఉద్యోగిని ఆరోపణల కేసు
  • విచారణ కమిటీతో భేటీ అయి నిర్ణయం చెప్పిన న్యాయమూర్తులు
  • ఏకపక్ష విచారణ వల్ల అపెక్స్‌ కోర్టు ప్రతిష్ట దెబ్బతింటుందని వివరణ

ఏకపక్ష విచారణ వల్ల దేశంలోని అత్యున్నత న్యాయ స్థానం ప్రతిష్ట దెబ్బతింటుందని, కారణాలు ఏమైనా కేసు విచారణలో బాధ్యులతోపాటు, బాధితులను భాగస్వాములు చేసి విచారించడం సరైన విధానమని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌  నారీమన్‌ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తనను లైంగికంగా వేధించారంటూ కోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ ఇందు మల్హోత్ర, జస్టిస్‌ ఇందిరా బెనర్జీతో  విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీతో భేటీ అయిన న్యాయమూర్తులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

అంతర్గత విచారణకు వచ్చేందుకు ఫిర్యాదుదారు నిరాకరించినప్పటికీ సీజేపై ఆమె చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపైనే న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారులను కలుపుకోకుండా విచారణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

విచారణ సందర్భంగా తాను లాయర్‌నుగాని, న్యాయసలహా దారునిగాని పెట్టుకునేందుకు అనుమతించడం లేదని, పైగా ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశావంటూ కమిటీ తనను పదేపదే అడుగుతోందని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ  అంశాలను న్యాయమూర్తులు ప్రస్తావిస్తూ ఫిర్యాదుదారు న్యాయవాదిని పెట్టుకునేందుకు అనుమతించాలని, విచారణలో ఆమెను భాగస్వామిని చేయాలని కోరారు.

More Telugu News