Nitin Gadkari: ఇప్పటివరకూ చూసింది ట్రయిలరే... ముందుంది అసలు సినిమా: నితిన్ గడ్కరీ

  • ముందుముందు మరింత సంక్షేమం
  • కాంగ్రెస్ విపక్షానికి మాత్రమే పరిమితం
  • ఎన్ని పార్టీలు కలిసినా బీజేపీని ఏమీ చేయలేరు
  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ల పాటూ ప్రజలు చూసిన పాలన కేవలం ట్రయిలర్ మాత్రమేనని, అసలు చిత్రం భవిష్యత్తులో కనిపిస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందించనుందని అన్నారు. కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు పాలించినా, దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, ఇకపై వారు విపక్షానికే పరిమితమని ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. గడచిన 60 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులను కాంగ్రెస్ ఎదుర్కుంటోందని, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితులు లేవని అన్నారు.

బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని, అయినా, తమ పార్టీని ఏమీ చేయలేరని గడ్కరీ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీపై దేశ ప్రజలకు నమ్మకం లేదని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ గెలుస్తుందంటే, ఎవరికీ విశ్వాసం కలగడం లేదని అన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని నెహ్రూ హయాం నుంచి చెబుతున్న కాంగ్రెస్, ఇప్పటివరకూ ఆ పని చేయలేకపోయిందని, తాజాగా 'న్యాయ్' అంటూ మరో పథకాన్ని తెరపైకి తెచ్చిందని ఎద్దేవా చేశారు. మసూద్ అజర్ అంశమై ఇండియా చూపిన దౌత్యనీతికి ప్రపంచ దేశాలు అండగా నిలిచాయని ఆయన అన్నారు.

More Telugu News