Nuziveedu: 'ప్రియుడే కావాలి... తండ్రి వద్దు' నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని పట్టు!

  • ఇంటర్న్ షిప్ చేస్తున్న వేళ యువకుడితో పరిచయం
  • అతనే కావాలంటూ పట్టు
  • తండ్రితో వెళితే పెళ్లి చేస్తారని భయపడుతున్న జ్యోత్స్న

తన తండ్రితో వెళ్లేది లేదని, తనకు ప్రియుడే కావాలని ఓ యువతి పట్టుబట్టడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యను అభ్యశిస్తున్న ఓ యువతి, పరీక్షలు పూర్తయిన తరువాత, ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమె తండ్రి వచ్చిన క్రమంలో, రానని మొండికేసింది. గుంటూరు జిల్లా వెల్లటూరుకు చెందిన జ్యోత్స్న అనే యువతి, ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. గత సంవత్సరం ఇంటర్న్ షిప్ కు వెళ్లిన సమయంలో ఆమెకు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మోహన మురళి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారగా, ఎంబీఏ చదివి ఉద్యోగం చేస్తున్న మురళి, ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు.

ఇక వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని గమనించిన జ్యోత్స్న తండ్రి ఆమెను మందలించాడు. శనివారంతో తృతీయ సంవత్సరం పరీక్షలు ముగియగా, ట్రిపుల్ ఐటీ వద్దకు వచ్చి కుమార్తెను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తండ్రితో వెళితే పెళ్లి చేస్తారని, అది తనకు ఇష్టం లేదని జ్యోత్స్న చెప్పడంతో, ఆయన కాలేజీ అధికారులకు విషయం చెప్పాడు. తాము నచ్చజెప్పినా జ్యోత్స్న వినకపోవడంతో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. నూజివీడు సీఐ స్వయంగా ఆమెకు కౌన్సెలింగ్ చేసినా, తండ్రితో వెళ్లేందుకు జ్యోత్స్న అంగీకరించలేదు. దీంతో మోహన మురళిని పిలిపించాలని నిర్ణయించామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News