Rahul Gandhi: రాహుల్‌ మెడకు యూపీఏ హయాంలో జరిగిన రక్షణ ఒప్పందం ఉచ్చు?

  • స్కార్పియన్‌ జలాంతర్గాముల విడిభాగాలకు సంబంధించిన డీల్‌
  • తన మిత్రుడికి లాభం చేకూర్చారని బీజేపీ ఆరోపణ
  • ఫ్లాష్‌ ఫోర్జ్‌ సంస్థకు నేవల్‌ సబ్‌ కాంట్రాక్టు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో మూడు విడతల పోలింగ్‌ మిగిలి ఉండగా యూపీఏ హయాంలో జరిగిన ఓ రక్షణ ఒప్పందం ఉచ్చులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చిక్కుకునేలా కనిపిస్తోంది. స్కార్పియన్‌ జలాంతర్గాముల విడిభాగాల తయారీకి సంబంధించి ‘నేవల్‌ గ్రూప్‌’ అనే ఫ్రెంచ్‌ కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో తన మిత్రుడికి ప్రయోజనం కలిగేలా రాహుల్‌ వ్యవహరించారని అధికార బీజేపీ ఆరోపిస్తోంది. దీనివల్ల రాహుల్‌ మాజీ వ్యాపార భాగస్వామికి 20 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు దక్కిందని ధ్వజమెత్తుతోంది.

వివరాల్లోకి వెళితే...ముంబయిలోని మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌)లో తయారయ్యే స్కార్పీన్‌ జలాంతర్గాములకు అవసరమయ్యే విడిభాగాలు సరఫరా చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ‘నేవల్‌ గ్రూప్‌’ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ 2011లో విశాఖకు చెందిన ‘ఫ్లాష్‌ ఫోర్జ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కంపెనీతో సబ్‌ కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ సంస్థ డైరెక్టర్లలో ఉల్రిక్‌ మెక్‌నైట్‌ ఒకరు.

ఇతను 2012 నవంబరు 8న ఫ్లాష్‌ ఫోర్జ్‌ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు.  ఇతనికి సంస్థలో 4.9 శాతం వాటా వుంది. ఇదే మెక్‌నైట్‌తో కలిసి రాహుల్‌ గాంధీ 2003లో ‘బ్యాకప్‌ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌’ పేరుతో బ్రిటన్‌లో ఓ సంస్థను నెలకొల్పారు. ఫ్లాష్‌ ఫోర్జ్‌లో తన మిత్రుడు ఉన్నందునే అతనికి లాభం చేకూర్చేలా అప్పట్లో యూపీఏ ప్రభుత్వం వ్యవహరించిందన్నది బీజేపీ తాజా ఆరోపణ.

More Telugu News