Mahesh Babu: దర్శకుడు సుకుమార్ ను ఉద్దేశించి ఏమీ అనలేదు: మహేశ్ బాబు

  • మహేశ్ కోసం వెయిట్ చేయలేకపోయిన సుకుమార్
  • పుకార్లపై స్పందించిన టాలీవుడ్ ప్రిన్స్
  • వంశీని పొగిడేందుకే అలా మాట్లాడానని వెల్లడి

ఇటీవల 'మహర్షి' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగిన సమయంలో కొందరు దర్శకులు స్టోరీని సిద్ధం చేసుకున్న తరువాత ఏ మాత్రం వెయిట్ చేయలేకున్నారని మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో కొత్త చర్చకు తెరలేపగా, మహేశ్ వివరణ ఇచ్చారు. మహేశ్ చేసిన వ్యాఖ్యలు సుకుమార్ ను ఉద్దేశించి చేసినవేనని, 'రంగస్థలం' వంటి హిట్ తరువాత, సుకుమార్ మహేశ్ కోసం ఓ కథను రెడీ చేయగా, కొంతకాలం వెయిట్ చేయాలని మహేశ్ చెప్పారని, వెయిటింగ్ ఇష్టంలేని సుకుమార్, మరో హీరో వద్దకు వెళ్లారని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే 'మహర్షి' ఫంక్షన్ లో మహేశ్ అలా మాట్లాడారని వార్తలు వచ్చాయి. ఇక దీనిపై స్పందించిన మహేశ్, 'మహర్షి' సినిమా కోసం వంశీ రెండేళ్లు ఆగాడని, ఆయన్ను పొగిడేందుకు మాత్రమే తాను ఆ మాట అన్నానే తప్ప సుకుమార్ గురించి కాదని స్పష్టం చేశారు. సుకుమార్ తనకు ఓ ప్రత్యేకమైన డైరెక్టరని, భవిష్యత్తులో తామిద్దరి కాంబినేషన్ లో సినిమా తప్పకుండా ఉంటుందని అన్నారు.

More Telugu News