క్యాట్‌వాక్‌లో సందడి చేసిన ‘క్యాట్’.. ఆ తర్వాత ఏం చేసిందంటే?

05-05-2019 Sun 09:02
  • మొరాకాలో ఫ్యాషన్‌ షో video
  • ర్యాంప్‌పై సందడి చేసిన పిల్లి
  • టాయిలెట్ పోసి ఎంచక్కా వెళ్లిపోయిన వైనం
ఫ్యాషన్ ప్రపంచం గురించి అవగాహన ఉన్న వారికి క్యాట్‌వాక్ అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేటెస్ట్ డిజైన్స్‌ను అందమైన అమ్మాయిలు ర్యాంప్‌పై వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి ప్రదర్శిస్తారు. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందన్న సంగతిని పక్కన పెడితే ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకాలో జరిగిన క్యాట్‌వాక్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ క్రిస్టియన్ డియోర్ రూపొందించిన దుస్తుల డిజైన్లను మోడళ్లు ప్రదర్శిస్తున్నారు. ఆహూతులు కూడా అంతే సిరియస్‌గా దుస్తుల డిజైన్లను వీక్షిస్తున్నారు. తన లేకుండా క్యాట్‌వాక్‌కు అర్థం లేదనుకుందో ఏమో! ఎక్కడి నుంచే ఓ క్యాట్ (పిల్లి) ర్యాంపుపైకి వచ్చింది. వయ్యారాలు పోతున్న మోడల్స్‌కు మల్లే అది కూడా హుందాగా ‘వాక్’ చేసింది. ఆ తర్వాత ర్యాంపు పక్కన కూర్చున్న ఓ యువతి వద్దకు వెళ్లి ఆమె డ్రెస్‌పై టాయిలెట్ పోసి ఎంచక్కా వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.