India: 'ఫణి'ని బాగా మేనేజ్ చేశారు... భారత్ కు ఐక్యరాజ్యసమితి అభినందన

  • భారత్ పాఠాలు నేర్చుకుంది
  • ఇదే తీరులో 1999లో తుపాను వస్తే 10 వేల మంది మరణం
  • భారత్ పై ప్రశంసల వర్షం కురిపించిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ విభాగం

ఫణి తీవ్ర పెనుతుపాను స్థాయిలో తీరం దాటినా ప్రాణనష్టం కనిష్టస్థాయికి పరిమితం చేసిన భారత ప్రభుత్వం పనితీరును ఐక్యరాజ్యసమితి అభినందించింది. ఎంతో కచ్చితత్వంతో కూడిన అంచనాలు, ముందస్తు హెచ్చరికలు, ఆపై సహాయక చర్యలతో ప్రజలను భారీ నష్టం నుంచి కాపాడారని ఐక్యరాజ్యసమితికి చెందిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ విభాగం ప్రశంసల వర్షం కురిపించింది. ఫణి తుపాను తీవ్రత దృష్ట్యా ప్రాణనష్టాన్ని తగ్గించడంలో భారత ప్రభుత్వం చూపించిన పనితీరు అద్భుతమని పేర్కొంది.

అంతేగాకుండా, అత్యంత కచ్చితమైన వాతావరణ హెచ్చరికలతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తనవంతు పాత్రను సమర్థంగా పోషించిందని డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ విభాగం ప్రతినిధి డెన్నిస్ మెక్ క్లీన్ తెలిపారు. ఐఎండీ అందించిన సరైన సమాచారంతో తుపాను ప్రభావిత ప్రాంతాలను గుర్తించి 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని డెన్నిస్ పేర్కొన్నారు.

ఇదే తరహాలో 1999లో ఒడిశాను తాకిన తుపాను సుమారు 10 వేల మందిని బలిగొందని, కానీ, భారత్ పాఠాలు నేర్చుకుని ఫణి విషయంలో మరణాల సంఖ్యను చాలా తగ్గించివేసిందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రతినిధి క్లేర్ నల్లిస్ వివరించారు. శుక్రవారం ఉదయం ఒడిశాలోని పూరీ వద్ద ఫణి తీరం దాటిన నేపథ్యంలో మృతుల సంఖ్య 10గా అధికారులు పేర్కొన్నారు.

More Telugu News