Andhra Pradesh: ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం చాలా గట్టిగా ఉంది!: మాగంటి రూప సంచలన వ్యాఖ్యలు

  • ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈరోజు భేటీ
  • పోలింగ్ సరళి, టీడీపీ శ్రేణుల పనితీరుపై నివేదిక
  • రాజమండ్రి నుంచి ఘనవిజయం సాధిస్తానని ధీమా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు రాజమండ్రిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందుకు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి లోక్ సభ అభ్యర్థి మాగంటి రూప సహా పలువురు నేతలు హాజరయ్యారు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి, టీడీపీ అభ్యర్థుల పనితీరుపై నివేదికలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాగంటి రూప మాట్లాడారు.

ఏపీలో ఈసారి జనసేన ప్రభావం గట్టిగానే ఉండే అవకాశముందని మాగంటి రూప తెలిపారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అనుకున్నదాని కంటే గట్టిగానే ఉందని వ్యాఖ్యానించారు. అయితే జనసేన కారణంగా ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందన్న విషయం ఇంకా తేలాల్సి ఉందని అన్నారు. ఈసారి రాజమండ్రి లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలనూ టీడీపీ గెలుచుకుంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

గతంలో ఇంత భారీ స్థాయిలో ఎన్నడూ పోలింగ్ నమోదు కాలేదనీ, అందుకే గెలుపుపై ధీమాగా ఉన్నామన్నారు. ఏపీ ముఖ్యమంత్రితో పోలింగ్ సరళి, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్లు పేర్కొన్నారు.  

More Telugu News