Andhra Pradesh: సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అంటే చంద్రబాబు అంతలా ఎందుకు భయపడుతున్నారు?: వాసిరెడ్డి పద్మ

  • ఎవ్వరూ చేయని తప్పుడు పనుల్ని బాబు చేశారు
  • బాబు హయంలో ఐదుగురు సీఎస్ లు పనిచేశారు
  • వారిలో ముగ్గురు పంటికింద రాయిలా మారారు
  • హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నేత

దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని తప్పుడు పనులను చంద్రబాబు చేశారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. టీడీపీ నేతలు ప్రస్తుతం కేడర్ కు ముఖాలు చూపించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తన సమావేశాలకు రావడంలేదని చంద్రబాబు వాపోతున్నారనీ, సీఎస్ అంటే అంతలా ఎందుకు భయపడుతున్నారని ఆమె టీడీపీ అధినేతను ప్రశ్నించారు.

చంద్రబాబు హయాంలో ఐదుగురు సీఎస్ లు పనిచేశారనీ, వారిలోముగ్గురు ఆయనకు పంటికింద రాయిలా మారారని అన్నారు. దీనిబట్టే బాలు పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.

చేసిన తప్పులు బయటపడకూడదన్న తాపత్రయం చంద్రబాబు ముఖంలో కనిపిస్తోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఏపీకి తప్పిన ఫణి తుపానును తాను సమర్థవంతంగా కంట్రోల్ చేశానని చంద్రబాబు చెప్పడం చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ విధ్వంసమేనని స్పష్టం చేశారు.

డబ్బా కొట్టుకోవడం తప్ప చంద్రబాబుకు హుందాగా వ్యవహరించడం తెలియదని చురకలు అంటించారు. ఫణి తుపాను సమయంలో సమర్థవంతంగా పనిచేసిన అధికారులను చంద్రబాబు కనీసం అభినందించలేదని గుర్తుచేశారు. ఆయన వ్యవహారశైలి చూసి టీడీపీ శ్రేణులే సిగ్గుపడుతున్నాయని విమర్శించారు.

More Telugu News