కరుడుగట్టిన నిందితుల బ్యారక్‌లో సైకో శ్రీనివాసరెడ్డి.. పటిష్ట బందోబస్తు

04-05-2019 Sat 07:12
  • శ్రీనివాస్‌రెడ్డికి కాపలాగా జవాను
  • ప్రవర్తన అంచనా వేసేందుకు గదిలో కెమెరాలు
  • పేపర్లలో అతడిపై వచ్చిన వార్తలను కట్ ‌చేసి ఇస్తున్న అధికారులు

బాలికలపై అత్యాచారం చేసి, ఆపై హత్యచేయడాన్ని అలవాటుగా మార్చుకున్న హాజీపూర్ హత్యాచారాల నిందితుడు, సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్నాడు. కరుడుగట్టిన నిందితులను ఉంచే ప్రత్యేక బ్యారక్‌లో పటిష్ట భద్రత మధ్య అతడిని ఉంచారు. ఇతర ఖైదీలతో కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డిని జైలుకు తీసుకొచ్చినప్పుడు అతడి ప్రవర్తన మధ్యస్థంగా ఉందని, సాధారణంగా కానీ, అసాధారణంగా కానీ ఏమీ లేదని జైలు సూపరింటెండెంట్‌ మురళి బాబు తెలిపారు.  

శ్రీనివాస్‌రెడ్డి లాంటి నేరగాళ్లు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టమని, అందుకనే ఎవరితోనూ కలవకుండా ప్రత్యేక సెల్‌లో ఉంచినట్టు తెలిపారు. సెల్‌లో అతడి ప్రవర్తనను తెలుసుకునేందుకు సీసీటీవీ కెమెరాలు అమర్చినట్టు చెప్పారు. సాధారణంగా జైలులో 300 మంది ఖైదీలకు ఓ జవాను కాపలాగా ఉంటాడని, కానీ శ్రీనివాస్‌రెడ్డి కోసం ప్రత్యేకంగా ఒకరిని కేటాయించినట్టు వివరించారు. ప్రతి రోజూ అతడికి పేపర్, రెండు పూటలా భోజనం ఇస్తున్నట్టు మురళి తెలిపారు. పేపర్‌లో అతడిపై వచ్చిన వార్తలను ప్రత్యేకంగా కత్తిరించి ఇస్తునట్టు తెలిపారు.