Andhra Pradesh: తుపాన్ బాధితులను ప్రజలు, టీడీపీ శ్రేణులు ఆదుకోవాలి: సీఎం చంద్రబాబు

  • ఆర్టీజీఎస్ తో తుపాన్ గురించిన అంశాలు స్పష్టంగా తెలుసుకున్నాం
  • వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశంపై పోరాటం ఆగదు
  • ఎన్నికల కోడ్ ని అందరికీ సమానంగా వర్తింపజేయాలి

ఏపీలో ‘ఫణి’ తుపాన్ బాధితులను ప్రజలు, టీడీపీ శ్రేణులు ఆదుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. ఉండవల్లిలోని ప్రజా వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఆర్టీజీఎస్ ద్వారా తుపాన్ తీవ్రత, దాని ప్రభావం, తీరం దాటే అంశాలను స్పష్టంగా తెలుసుకున్నామని అన్నారు.

ఈ సందర్భంగా వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశం గురించి ఆయన ప్రస్తావించారు. దీనిపై తన పోరాటం కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఏ పోలింగ్ కేంద్రంపైన అయినా అనుమానం ఉంటే మొత్తం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును ఎందుకు విభేదిస్తున్నారని ప్రశ్నించారు.

 ఎన్నికల నియమావళిని అందరికీ సమానంగా వర్తింపజేయాలని, ఫారం-7 దరఖాస్తుల విషయంలో దొంగలను కాపాడతారా? ఈ విషయమై ఎవరికి రిపోర్టు చేయాలో సీఎస్ కు తెలియదా? అని ప్రశ్నించారు. అధికారుల బాధ్యతారాహిత్యం సహించబోమని చంద్రబాబు హెచ్చరించారు. ఈసీ కూడా నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని, ఎన్నికల నిర్వహణకు మాత్రమే ఈసీ పరిమితం కావాలని సూచించారు. ఐటీ, ఈడీ లాంటి సంస్థల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు.

More Telugu News