Telangana: తెలంగాణలో సాయంత్రం 5 తర్వాత లక్షల్లో ఓట్లు పడ్డాయి.. వెంటనే విచారణ జరిపించండి!: ఈసీకి టీకాంగ్రెస్ నేతల ఫిర్యాదు

  • ఈసీని కలిసిన రేణుక, మర్రి, నిరంజన్
  • ఖమ్మంలో ఘనవిజయం సాధిస్తానన్న రేణుక
  • చేవెళ్లలో పోలింగ్ 5 శాతం తగ్గడంపై విస్మయం

కాంగ్రెస్ పార్టీ నేతలు రేణుకా చౌదరి, మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ తదితరులు ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుసుకున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా అవకతవకలు జరిగాయనీ, ఈ విషయమై విచారణ జరిపించాలని ఫిర్యాదును అందజేశారు. అనంతరం రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మెజారిటీ లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు వ్యవహారంలో పలువురు పిల్లలు చనిపోవడానికి కేసీఆర్ ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించారు. ఖమ్మం లోక్ సభ స్థానంలో తన గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా సాయంత్రం 5 గంటల తర్వాత భారీ పోలింగ్ నమోదయిందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. సాయంత్రం తర్వాత లక్షల సంఖ్యలో ఓట్లు పోలయ్యాయని వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, ఖమ్మం, హైదరాబాద్‌లలో ఐదు గంటల తర్వాత లక్షల ఓట్లు పోలింగ్‌ కావడంపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

కానీ ఇదే సమయంలో చేవెళ్లలో మాత్రం పోలింగ్ శాతం గతంలో కంటే 5 శాతం తగ్గిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలనీ, సాయంత్రం 5 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న ఎంత మందికి కాల్ చిట్టీలు ఇచ్చారో రికార్డులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

More Telugu News