bjp: హింసకు హిందువులు అతీతం కాదు.. రామాయణ, మహాభారతాల్లో ఉన్నదంతా హింసే: సీతారాం ఏచూరి

  • హిందూ రాజులు, రాజ్యాల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి
  • హిందూ మతంలో హింస లేదని చెప్పడంలో లాజిక్ లేదు
  • భావోద్వేగాలతో రాజకీయం చేయడం బీజేపీకి అలవాటు

హిందువులు హింసకు దూరంగా ఉంటారని, వారెప్పుడూ శాంతి కాముకులేనని బీజేపీ నాయకురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కౌంటర్ ఇచ్చారు. హిందూ గ్రంధాల్లో హింస కావాల్సినంత ఉందని ఆయన అన్నారు. హిందువులు హింసను విశ్వసించరని సాధ్వి ప్రజ్ఞా సింగ్ అన్నారని... కానీ ఈ దేశంలోని ఎంతో మంది హిందూ రాజులు, రాజ్యాల మధ్య లెక్కలేనన్ని యుద్ధాలు జరిగాయని చెప్పారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణ, మహాభారతాల్లో ఉన్నదంతా యుద్ధం, హింసేనని అన్నారు. హిందూ పురాణాల్లో ఏముందో ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు చెప్పాలని సూచించారు. హిందువులు హింసకు అతీతమని మాత్రం దయచేసి చెప్పవద్దని అన్నారు.

హింస కేవలం ఒక మతంలో మాత్రమే ఉందని, హిందూ మతంలో హింస లేదని చెప్పడంలో లాజిక్ లేదని ఏచూరి అన్నారు. ఎన్నికలు సమీపించగానే ప్రజల భావోద్వేగాలతో బీజేపీ రాజకీయం చేయడం ప్రారంభిస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో వారికి రామ మందిరం, జాతీయ పౌరసత్వం, యూనిఫామ్ సివిల్ కోడ్, సెక్షన్ 370, ఆర్టికల్ 35ఏ వంటివన్నీ గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు.

More Telugu News