Narendra Modi: మోదీ ఎంత బలహీనుడో మరోసారి నిరూపించుకున్నారు!: మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ

  • ఉగ్రబాధితుల పోరాటం వల్లే మసూద్ పై నిషేధం
  • కానీ ఐరాసలో పుల్వామాకు సంబంధం లేదని అంగీకరించారు
  • తీర్మానానికి షరతులతో మద్దతు ఇచ్చిన చైనా

జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజర్ ను ఐక్యరాజ్య సమితి(ఐరాస) అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల మసూద్ ప్రయాణాలు, రాకపోకలపై నిషేధంతో పాటు ఆయనకు సంబంధించిన అన్ని ఆస్తులను ప్రపంచ దేశాలు జప్తు చేయవచ్చు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. భారత్ లో ఉగ్రదాడుల్లో తమ వారిని కోల్పోయిన బాధితుల పోరాటం కారణంగానే ఇన్నాళ్లకు మసూద్ ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిందని ఒవైసీ తెలిపారు.

కానీ మోదీ ప్రభుత్వం మాత్రం 2009 తర్వాత జరిగిన ఉగ్రదాడులకు, మసూద్ కు సంబంధం లేదని అంగీకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాతే తీర్మానాన్ని ఐరాసలో ఆమోదింపజేశారన్నారు. దీనిని బట్టి ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధాని మోదీ చెప్పుకోదగ్గ విజయాన్ని ఇంకా అందుకోలేదని స్పష్టం చేశారు. ఎలాంటి కారణం లేకుండా ఐరాస తీర్మానంలో మసూద్ అరాచకాల తొలగింపునకు భారత్ అంగీకరించిందని మండిపడ్డారు.

తాను ఎంత బలహీనుడినో మోదీ మరోసారి నిరూపించుకున్నారని దుయ్యబట్టారు. మసూద్ అజర్ కు పుల్వామా, ఉరీ సహా ఇతర ఉగ్రదాడులతో సంబంధం ఉందన్న వ్యాఖ్యలను తొలగించిన అనంతరమే ఐరాసలో ఈ తీర్మానానికి చైనా మద్దతు ఇచ్చింది.

More Telugu News