Cricket: ప్రపంచకప్‌ క్రికెట్‌లో భారత్‌ ఫేవరేట్‌: సచిన్‌ టెండూల్కర్‌

  • అక్కడి వేసవి ఎండలకు పిచ్‌లు ప్లాట్‌గా మారనున్నాయి
  • ప్లాట్‌ పిచ్‌లు బ్యాట్స్‌మన్‌లకు అనుకూలం
  • ఇది భారత్‌కు కలిసి వచ్చే అవకాశం

ఇంగ్లండ్‌లో ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న క్రికెట్‌ ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌కే విజయావకాశాలు అధికమని భారత్‌ లెజెండరీ బ్యాట్స్‌మన్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ జోస్యం చెప్పారు. ముంబయిలోని ఎంఐజీ మైదానంలో సచిన్‌ పేరుతో ఏర్పాటు చేసిన పెవిలియన్‌ ఎండ్‌ను గురువారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఇంగ్లండ్‌లో మంచి వేసవి సమయాన పోటీలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. సాధారణంగా ఎండ ప్రభావానికి పిచ్‌లు ప్లాట్‌గా మారుతుంటాయని, పైగా ఇంగ్లండ్‌ పిచ్‌లు సాధారణంగా ప్లాట్‌గా ఉంటాయని, అటువంటి పరిస్థితి భారత్‌ బ్యాట్స్‌మన్‌కు అనుకూలమని చెప్పారు. గతంలో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో కూడా ఇటువంటి పరిస్థితే ఉందని గుర్తుచేశారు. ఇంగ్లండ్‌ వాతావరణంలో ఏమైనా అసాధారణ పరిస్థితులు చోటు చేసుకుంటే తప్ప అక్కడి పిచ్‌లలో మార్పు ఉండదన్నారు.

ప్రస్తుతం భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉందని చెప్పారు. కొహ్లీ, కె.ఎల్‌.రాహుల్‌, హార్డిక్‌పాండ్యా వంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో రాణిస్తున్నారని చెప్పారు. ఒక క్రికెటర్‌ ఏ ఫార్మాట్‌లో రాణించినా అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఆ తర్వాత ఫార్మాట్‌ మారినా పరిస్థితులకు అనుగుణంగా ఆడగలరని చెప్పారు.

‘భారత్‌ జట్టు ఆటగాళ్లంతా ప్రపంచకప్‌ ముందు సరిపడే క్రికెట్‌ ఆడారు. లోపాలు ఏమైనా ఉంటే సవరించుకునే ఉంటారు. కాబట్టి ఈసారి భారత్‌ ఫేవరేట్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు’ అని సచిన్ జోస్యం చెప్పారు. ఓ వైపు క్రికెట్‌ విశ్లేషకులంతా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు ఈసారి ఫేవరేట్‌ అంటుంటే సచిన్‌ మాత్రం భారత్‌కు ఓటేసి మన ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశారు అనొచ్చు.

More Telugu News