Andhra Pradesh: తుపాను సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి!: టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ సూచన

  • ఆర్టీజీఎస్ ద్వారా ఫణిని సమీక్షిస్తున్నాం
  • ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలి
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత

బంగాళాఖాతంలో అతితీవ్ర తుపానుగా మారిన ‘ఫణి’ ప్రభావంపై ఆర్టీజీఎస్‌ ద్వారా అనుక్షణం సమీక్షిస్తున్నామని టీడీపీ నేత సీఎం రమేశ్ తెలిపారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో గంట‌కు 130 నుంచి 150 కిలోమీట‌ర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. కాబట్టి ప్ర‌జ‌లంతా జాగ్ర‌త్త‌గా ఉండాలనీ, సుర‌క్షిత ప్రాంతాల్లో త‌ల‌దాచుకోవాలని సూచించారు. ప్ర‌స్తుతం విశాఖపట్నం నుంచి తూర్పు ఆగ్నేయ దిశ‌గా 200 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఫణి గంట‌కు 19 కి.మీ వేగంతో ప‌య‌నిస్తోందని పేర్కొన్నారు. ఈరోజు, రేపు హైఅలర్ట్ కొనసాగుతుందన్నారు.

ఫణి ప్రభావంతో విజయనగరం జిల్లా తీరప్రాంత మండలాల్లో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు ఒడిసాలోని పూరీ వ‌ద్ద తుపాను తీరం దాటనుందని అన్నారు. దీనివల్ల ఈ రోజు అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తాయని సీఎం రమేశ్ చెప్పారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికారులను మోహరించామనీ, ప్రజలు భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఈ మేరకు సీఎం రమేశ్ ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News