Andhra Pradesh: పట్నాయక్ జీ.. మీకు మేమున్నాం.. ఒడిశా సీఎంకు చంద్రబాబు ఫోన్!

  • ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామన్న బాబు  
  • ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలిపిన నవీన్ పట్నాయక్
  • రేపు ఉదయం 10 గంటలకు పూరీని తాకనున్న ఫణి తుపాను

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు ఫోన్ చేశారు. ఫణి తుపాను ఒడిశా దగ్గర తీరం దాటుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆయనతో మాట్లాడారు. ఒడిశాకు ఎలాంటి సహాయం అందించేందుకైనా సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఇలాంటి కష్టకాలంలోనే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ సందర్భంగా చంద్రబాబుకు నవీన్ పట్నాయక్ ధన్యవాదాలు తెలిపారు. తుపాను సందర్భంగా ఏపీ నుంచి తప్పకుండా సాయం తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు ఈరోజు ఫణి తుపానుపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫణి రేపు ఉదయం 10 గంటలకు ఒడిశాలోని పూరీని తాకవచ్చన్న ఆర్టీజీఎస్ అంచనాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలోని 15 మండలాలు, 200 గ్రామాలపై ఫణి తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని అధికారులు చెప్పిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు.

సహాయ చర్యలు, పునరావాస కార్యక్రమాల కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించామన్నారు. టెక్కలి, పలాస కేంద్రాలుగా సూపర్ సైక్లోన్ బృందాలు పనిచేస్తున్నట్టు అధికారులు ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

More Telugu News