Telangana: వీహెచ్ లాంటి సీనియర్ నేతను ఓ కుర్రకుంక బఫూన్ అంటున్నడు!: రేవంత్ రెడ్డి ఆగ్రహం

  • తన స్నేహితుల సంస్థకు కేటీఆర్ కాంట్రాక్టు ఇచ్చారు
  • ఎంసెట్ వ్యవహారంలో ఇంతవరకూ చర్యలెందుకు తీసుకోలేదు?
  • హైదరాబాద్ లో మీడియాతో కాంగ్రెస్ నేత

తెలంగాణలో ఇంటర్ ఫలితాల గందరగోళంపై  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 20 ఏళ్లుగా పరీక్షను నిర్వహిస్తున్న సంస్థను తప్పించిన కేటీఆర్, తన బావమరిది స్నేహితుడి సంస్థ గ్లోబరినాకు టెండర్ ఇప్పించారని ఆరోపించారు. తెలంగాణ ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో ఇంతవరకూ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

కేటీఆర్‌ ఫ్రెండ్‌ మామ సంస్థ అయిన మాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలకు నిరసనగా ఈరోజు యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ నేతలు గాంధీ భవన్ వద్ద చేపట్టిన 48 గంటల నిరసన దీక్షకు రేవంత్ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతుంటే, కుర్రకుంక(కేటీఆర్) ఆయన్ను బఫూన్‌ అంటున్నారని మండిపడ్డారు. దీన్నిబట్టి తెలంగాణలో ఎంత బలుపు పాలన సాగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. వీళ్లందరికీ బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యాఖ్యానించారు.

More Telugu News