IAF: అత్యంత ప్రమాదకర లెహ్ ఎయిర్ పోర్టులో 1000 ల్యాండింగ్స్... పైలట్ కు సెల్యూట్ చెప్పిన వాయుసేన!

  • భారీ సామాగ్రిని తీసుకెళ్లే భారీ విమానం ఐఎల్-76
  • సురక్షితంగా ల్యాండింగ్ చేస్తుండే సందీప్ సింగ్
  • ఆయన సేవలను ప్రశంసించిన ఐఏఎఫ్

ఇండియాలోని అత్యంత ప్రమాదకర వాతావరణ పరిస్థితుల్లో ఉండే ఎయిర్ పోర్టులు అంటే గుర్తుకొచ్చేది లెహ్, థాయ్ సీ. హిమాలయాల్లో సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో ఉండే ఇక్కడ విమానాన్ని దించాలంటే ఎంతో కష్టతరం. ఎప్పుడు ఎటువైపు నుంచి బలంగా గాలులు వీస్తాయో తెలియని పరిస్థితుల్లో అత్యంత చాకచక్యంగా విమానాలను దించాల్సి వుంటుంది. ఇక ఈ ఎయిర్ పోర్టుల్లో గ్రూప్ కెప్టెన్ సందీప్ సింగ్ చహాబ్రా 1000 ల్యాండింగ్స్ ను ఏ మాత్రం ప్రమాదం జరుగకుండా చేయగా, భారత వాయుసేన అతన్ని 'బ్రేవ్ హార్ట్ పైలట్' అని కితాబిస్తూ సెల్యూట్ చేసింది.

వాయుసేనకు చెందిన ఐఎల్ - 76ఎండీ విమానాన్ని బుధవారం లేహ్ లో దించడం ద్వారా ఆయన తన 1000 ల్యాండింగ్స్ ను పూర్తి చేసుకున్నారు. ఈ రెండు ఎయిర్ పోర్టులూ సముద్రమట్టానికి 10 వేల అడుగులకు పైగా ఎత్తునే ఉంటాయి. ఇక సందీప్ సింగ్ నడిపే విమానాలు సామాన్యమైనవి కావు. చాలా భారీగా ఉంటాయి. సైన్యానికి అవసరమైన భారీ మిలటరీ వాహనాలను, ట్రక్కులను తీసుకుని వెళుతుంటుంది. ట్యాంకర్లకు అందించాల్సిన ఇంధనాన్ని కూడా దీనిలోనే పంపుతుంటారు.

మొత్తం 8,500 గంటల ఫ్లయ్యింగ్ అనుభవమున్న కెప్టెన్ చహాబ్రా, దాదాపు 5 వేల గంటలు ఐఎల్-76/78 విమానాల్లోనే గడిపారు. లెహ్, థాయ్ సీ విమానాశ్రయాల్లో రాత్రిపూట విమానాలను దించేందుకు అనుమతి ఉన్న అతికొద్ది మంది పైలట్లలో ఈయన ఒకరు.




More Telugu News