Cyclone Fani: ‘ఫణి’ ఎఫెక్ట్.. వణుకుతున్న ఒడిశా.. సురక్షిత ప్రాంతాలకు 8 లక్షల మంది తరలింపు

  • ఒడిశాను బెంబేలెత్తిస్తున్న ‘ఫణి’
  • గోపాల్‌పూర్-చాంద్‌బలి మధ్య రేపు తీరం దాటనున్న తుపాను
  • 103 రైళ్లు రద్దు.. టికెట్ డబ్బులు వాపస్

ఫణి తుపాను రేపు (శుక్రవారం) తీరాన్ని తాకనున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ఈ ఉదయం 5:30 గంటలకు అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందినట్టు ఐఎండీ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఈ ఉదయం నాటికి పూరికి దక్షిణ నైరుతి దిశగా 450 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్టు పేర్కొంది. ఇది ఉత్తర ఈశాన్యం దిశగా కదిలి గోపాల్‌పూర్-చాంద్‌బలి మధ్య రేపు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఆ సమయంలో గంటకు 170-180 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని గంజాం, గజపతి, ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపడ, భద్రక్, జాజ్‌పూర్, బాలాసోర్ జిల్లాలపై ఫణి తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సహాయక బృందాలు అప్రమత్తమయ్యాయి. విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తీర ప్రాంతాల నుంచి 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 50 అగ్నిమాపక బృందాలను సిద్ధం చేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో 103 రైళ్లను రద్దు చేశారు. రెండు రైళ్లను దారి మళ్లించారు. రైళ్లను రద్దు చేసిన నేపథ్యంలో ప్రయాణికులకు పూర్తి చార్జిలను వెనక్కి చెల్లిస్తామని రైల్వే ప్రకటించింది.

More Telugu News