ఇంటికి నిప్పంటించాడని.. భర్త కాళ్లు చేతులు కట్టేసి సజీవ దహనం చేసిన భార్య, పిల్లలు

02-05-2019 Thu 09:08
  • భార్యతో గొడవపడి ఇంటికి నిప్పంటించి పరారైన ఉపాధ్యాయుడు
  • పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లి తగలబెట్టిన భార్య, కుమారులు
  • పోలీసులకు లొంగుబాటు
భార్యతో గొడవపెట్టుకుని ఇంటికి నిప్పంటి పరారైన భర్తను పట్టుకున్న భార్య, కుమారులు అతడిని అడవిలోకి తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి తగలబెట్టారు. కుమురంభీం జిల్లా జైనూరు మండలం జంగాం పంచాయతీ పరిధిలోని రాంజీగూడలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..  గ్రామానికి చెందిన కుమ్ర నారాయణ(52) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గత నెల 25న అర్ధరాత్రి భార్యతో గొడవపెట్టుకున్నాడు. అనంతరం కోపంతో ఇంటికి నిప్పంటించి పరారయ్యాడు. అప్రమత్తమైన భార్య యమునాబాయి, పిల్లలు ఇంటి నుంచి బయటపడి ప్రాణాలు రక్షించుకున్నారు.

గ్రామం నుంచి పరారైన నారాయణ ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడలో ఉంటున్న బంధువు ఇంటికి వెళ్లి తలదాచుకున్నాడు. తమను చంపేందుకు ప్రయత్నించిన భర్తపై కోపం పెంచుకున్న యమునాబాయి, కుమారుడు రాజ్‌కుమార్‌, కుమార్తె తుమ్రం ఆదిలక్ష్మి, మరో ముగ్గురు గ్రామస్తులు కలిసి గాదిగూడ చేరుకుని నారాయణను పట్టుకున్నారు. అక్కడి నుంచి ఆటోలో ఖడ్కీ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేశారు. అనంతరం ఆటోతో సహా అతడిని తగలబెట్టారు. మంగళవారం యమునాబాయి జైనూరు పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి జరిగింది చెప్పి లొంగిపోయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆమె చెప్పింది నిజమేనని నిర్ధారించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.