Telangana: కాంగ్రెస్ పార్టీలో ఓ బఫూన్ ఉన్నడు.. నన్ను పెద్దమ్మ గుడికి రా.. ప్రమాణం చేయ్ అంటున్నడు!: కేటీఆర్

  • బుద్ధి జ్ఞానం లేకుండా కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నారు
  • ఇంటర్ ఫలితాల విషయంలో సంయమనం పాటిస్తున్నాం
  • కేసీఆర్ పై కత్తులు దూసే మీడియా 24 గంటలు రీళ్లు తిప్పుతోంది
  • హైదరాబాద్ లో మేడే వేడుకల్లో టీఆర్ఎస్ నేత

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కానీ కాంగ్రెస్ నేత ఒకరు ఈ కాంట్రాక్టును గ్లోబరినా సంస్థకు తానే ఇప్పించాననీ, ఇందులో రూ.10,000 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఇది రూ.4.30 కోట్ల టెండర్ అని, అది కూడా మూడేళ్ల కాలానికి సంబంధించి ఈ ఒప్పందాన్ని ఇంటర్ బోర్డు, విద్యాశాఖలు గ్లోబరినాతో చేసుకున్నాయని వివరించారు. కొందరు నేతలు సోయి, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో ‘మే డే’ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.

ఇంటర్ ఫలితాల వివాదం విషయంలో తాము సంయమనం పాటిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ను బద్నాం చేయాలనుకుంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయనీ, పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. ‘మేం సంయమనం పాటిస్తున్నాం. నోరు లేకా కాదు.. మాట్లాడటం రాకా కాదు. కాంగ్రెస్ పార్టీలో ఇంకొక బఫూన్ ఉన్నడు. ‘నువ్వు పెద్దమ్మ గుడికి రా.. ప్రమాణం చేయ్.. లేదంటే నేను చెప్పిందే కరెక్ట్’ అంటడు. ఇదెక్కడి లాజిక్.

ఆయన చెప్పిన టైమ్ కు వెళ్లి నేను పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేయాలంట. ఇదెక్కడి చిల్లర రాజకీయం? అదే సమయంలో కేసీఆర్ ను ఎవరైనా ఏమైనా అంటే వాళ్లకు మద్దతుగా కత్తులు దూసే మీడియాలు కొన్ని ఉన్నాయి. వాళ్లకు ఇంకేం పని ఉండదు. 24 గంటలు రీళ్లు తిప్పడమే పని. నేను ఇంటర్ విద్యార్థులకు చేతులు జోడించి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. తొందరపడి ప్రాణాలు తీసుకుంటే తిరిగిరావు. చదువే జీవితం కాదు. తప్పు జరిగింది. ప్రభుత్వం మళ్లీ రీవెరిఫికేషన్ చేస్తోంది. కాబట్టి తొందరపడి ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్లను క్షోభకు గురిచేయవద్దు’’ అని కోరారు.

More Telugu News