Fani: రేపటిలోగా అందరూ ఖాళీ చేయండి... తుపాను నేపథ్యంలో పూరీలో టూరిస్టులకు హెచ్చరిక

  • తీవ్ర పెనుతుపానుగా మారిన ఫణి
  • ఒడిశా దిశగా పయనం
  • తీరప్రాంతాల్లో భయాందోళనలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుపాను తాజాగా తీవ్ర పెనుతుపానుగా మారిందన్న సమాచారం ఒడిశాకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఫణి మే 3న ఒడిశాలోని పారదీప్ వద్ద తీరం దాటుతుందని ప్రభుత్వ, ప్రయివేటు వాతావరణ సంస్థలన్నీ నిశ్చితాభిప్రాయానికి వచ్చేశాయి. ఇప్పటికే ఫణి తుపాను కేంద్రకం వద్ద గాలుల తీవ్రత 200 కిలోమీటర్లకు పైగా ఉందని సైక్లోన్ ట్రాకర్లు చెబుతున్న నేపథ్యంలో విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందన్నది ఊహకందని విషయంగా మిగిలిపోయింది.

ఇది హరికేన్-2 కేటగిరీకి సమానమైన తుపానుగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశాలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అక్కడి తీరప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రఖ్యాత పూరీ పుణ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇప్పడు తీవ్ర పెనుతుపాను గండం పొంచి ఉండడంతో వాళ్లందరినీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒడిశా సర్కారు హెచ్చరికలు జారీచేసింది.

పూరీ క్షేత్రంలో గురువారంలోగా అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎవర్ని ఉంచొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఓవైపు, సహాయ చర్యలకు అడ్డంకిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఒడిశా తుపాను ప్రభావ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేశారు.

More Telugu News