శ్రీనివాసరెడ్డిని జైలుకు పంపద్దు .. ఎన్ కౌంటర్ చేసేయండి!: కాంగ్రెస్ నేత వీహెచ్

01-05-2019 Wed 13:36
  • ఇతను మరో నయీం లాంటివాడు
  • హాజీపూర్ కు బస్సు వేయాల్సిందే
  • ఘటనాస్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేత

తెలంగాణలో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన సైకో శ్రీనివాసరెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు యాదాద్రి జిల్లాలోని హజీపూర్ లో ఘటనాస్థలాన్ని వీహెచ్ పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాసరెడ్డిని జైలులో పెట్టి బెయిల్ దొరికేలా చేయవద్దని సూచించారు. సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి మరో నయీం లాంటివాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్పన మిస్సింగ్ కేసులో పోలీసులు వెంటనే స్పందించి జాగ్రత్తగా విచారణ జరిపి ఉంటే మిగిలిన రెండు హత్యలు అసలు జరిగేవే కావని వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా హాజీపూర్ కు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ అయిందని సీఎం కేసీఆర్ చెబుతున్నారనీ, ఇప్పుడు ఇంటర్ ఫలితాలు, మహిళలపై అత్యాచారాల్లో కూడా నంబర్ వన్ గా మారిందని ఎద్దేవా చేశారు.