Andhra Pradesh: చంద్రబాబు అనే నేను.. కార్మికులందరికీ ఈ హమీ ఇస్తున్నాను!

  • కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తా
  • శ్రమ దోపిడీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
  • మేడే వేడుకల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ లో డ్రైవర్లు, అసంఘటిత రంగంలోని కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కార్మికుల శ్రమను దోపిడీ చేసే యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మే డే వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయిందనీ, ఉద్యోగాలు ఊడిపోయాయని చంద్రబాబు విమర్శించారు.

అయినా ఏపీకి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామనీ, తద్వారా ఉద్యోగాలు పోకుండా కాపాడామని చెప్పారు. ‘డ్రైవర్లకు గానీ, కార్మికులు అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రతీ ఒక్కరికి సొంతింటి కలను నెరవేరుస్తా. ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవాలన్నా, సంపద సృష్టి జరగాలన్నా అందుకు ముఖ్యంగా కావాల్సింది కార్మికులు.

ఈ కార్మికులే లేకపోతే ఇండస్ట్రీ లేదు. సంపద లేదు. పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలకు ఆదాయమే ఉండదు. ఏపీలో కార్మికులు, ఉద్యోగస్తులకు, కంపెనీల యాజమాన్యాలకు మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు. అందరూ సఖ్యతగా పనిచేసుకుంటున్నారు. దీనిపై చాలా సంతోషంగా ఉంది. ఇలా సఖ్యతతో పనిచేస్తూ సంపదలో, అభివృద్ధిలో ఏపీని దూసుకెళ్లేలా చేయాలని మీ అందరినీ కోరుతున్నా’ అని తెలిపారు

More Telugu News