West Bengal: పోలింగ్‌ సిబ్బందిని బెదిరించిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియోపై ఈసీ కేసు నమోదు

  • నాలుగో విడత పోలింగ్‌లో పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు
  • అసన్‌సోల్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ
  • ఆ సమయంలో అక్కడికి వెళ్లిన మంత్రి 

కేంద్ర మంత్రి, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం అసన్‌సోల్‌ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బాబుల్‌ సుప్రియోపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. నాలుగో విడత పోలింగ్‌లో భాగంగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

 ముఖ్యంగా అసన్‌సోల్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద సరైన భద్రత లేకుండా ఓటింగ్‌ నిర్వహిస్తున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు భద్రతా సిబ్బందితో గొడవ పడడం, ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు జోక్యం చేసుకోవడం, దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆ పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకున్న బాబుల్‌ సుప్రియోను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలింగ్‌ అడ్డుకుంటున్నారన్న సమాచారం మేరకే తానిక్కడికి వచ్చానని అప్పట్లో బాబుల్‌ వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా బాబుల్‌ పోలింగ్‌ సిబ్బందిని బెదిరించారని ఫిర్యాదు అందడంతో ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. అలాగే తూర్పు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌతంగంభీర్‌ తన ఫొటోతో ఓ ప్రకటన జారీ చేయడాన్ని తప్పుపడుతూ  అతనికి నోటీసులు జారీ చేసింది. ఎస్పీ నాయకుడు ఆజంఖాన్‌ ప్రచారంపై మరోసారి నిషేధం విధించింది.

More Telugu News