Nagababu: ​ తమ్ముడి కోసం అంతసేపు ఆలోచించడం చాలా తప్పనిపించింది: నాగబాబు

  • ఎంపీగా పోటీచేయమని పవన్ అడిగాడు
  • ఆలోచించి చెబుతానని వచ్చేశా
  • 12 గంటల టైమ్ తీసుకున్నా

మెగాబ్రదర్ నాగబాబు రాజకీయాల్లోకి ప్రవేశించడం, నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేయడం ఎవరూ ఊహించని విషయాలు. తమ్ముడు పవన్ కల్యాణ్ కు మద్దతుగా వీడియోలు రూపొందిస్తూ బిజీగా ఉన్న నాగబాబు ఆశ్చర్యకరమైన రీతిలో ఈ ఎన్నికల బరిలో దిగారు. దీనివెనుక జరిగిన కథాకమామీషు నాగబాబు తాజాగా వెల్లడించారు.

"పవన్ కల్యాణ్ సడన్ గా పిలిచి జనసేన పార్టీ తరఫున నరసాపురం నుంచి పోటీచేయడంపై నీ అభిప్రాయం ఏంటి? అని అడిగాడు. ఒక్కసారిగా అలా అడగడంతో కంగారుపడిపోయాను. ఏంచెప్పాలో తోచలేదు. దాంతో, 12 గంటల టైమ్ అడిగాను. చివరికి ఎప్పుడో తెల్లవారుజామున నిర్ణయం తీసుకుని అప్పుడు ఓకే చెప్పాను. కానీ, అంత సమయం ఎందుకు తీసుకున్నానో అర్థం కాలేదు. తమ్ముడు ఎంతో నమ్మకంతో అడిగితే, 12 గంటల సమయం అడిగి తప్పు చేశానా అనిపించింది.

జనసేన కోసం ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడిన వాడ్ని ఎంపీగా పోటీచేయమంటే అంతసేపు ఆలోచించడం ఏంటనిపించింది. ఎంపీ అనగానే మొదట భయం వేసిన మాట నిజం. ఆ భయంతోనే వెంటనే పవన్ కు బదులివ్వలేకపోయాను. అయితే, నరసాపురం ప్రజలు నాపై చూపిన అభిమానం మరువలేనిది. ఈ ఎన్నికల కారణంగా ఓ మేలు జరిగింది. ఇంతకుముందు మా తమ్ముడు పవన్ కల్యాణ్ తో ఎప్పుడో తప్ప కలిసేవాడ్ని కాదు, ఎన్నికల పుణ్యమా అని వాడితో ఎక్కువగా గడిపే అవకాశం వచ్చింది" అని వివరించారు.

More Telugu News