Brahmaputra River: బ్రహ్మపుత్ర నది కింద సొరంగం.. చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న భారత్!

  • సొరంగాన్ని తవ్వాలని సూచించిన నిపుణులు
  • వర్షాకాలం సమయంలో అంతరాయం
  • సొరంగం వల్ల శత్రు దాడుల భయం ఉండదు

ఏదో ఒక విధంగా భారత్ పై తరచుగా విషాన్ని చిమ్మే డ్రాగన్ కంట్రీ చైనా దుస్సాహసాలకు భారత్ విరుగుడు మంత్రం వేయనుంది. మన ఈశాన్య సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడడమే పనిగా పెట్టుకున్న చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వడానికి కేంద్రం పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రం అసోంను విభజిస్తున్న బ్రహ్మాపుత్ర నది కింద సొరంగాన్ని తవ్వాలని కేంద్రానికి నిపుణులు సూచించినట్టు సమాచారం.

 మన అరుణాచల్ ప్రదేశ్ ను తన సొంతంగా భావించే చైనా అప్పుడప్పుడు ఆ సరిహద్దుల్లో దురాక్రమణకు పాల్పడే ప్రయత్నాలు చేస్తుంటుంది. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో బ్రహ్మపుత్రను దాటి అక్కడకు సైనిక దళాలను చేరవేయడం తలకు మించిన భారంగా వుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే నిపుణులు ప్రభుత్వానికి సొరంగం సలహా ఇచ్చారట. దీనికి వెంటనే అంగీకరించిన కేంద్రం, పక్కా నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

వర్షాకాలంలో బ్రహ్మాపుత్ర నది ప్రవాహం కారణంగా ఆ పరిసర ప్రాంతాలలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో నదీ గర్భంలో 30 మీటర్లు లేదా అంతకంటే కింద సొరంగాన్ని నిర్మించడం ద్వారా సైనిక దళాలను ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా తరలించవచ్చని తెలుస్తోంది. అలాగే సొరంగం నిర్మించడం ద్వారా శత్రు దాడుల భయం కూడా ఉండదు. భద్రతా దళాలు సురక్షితంగా సరిహద్దుల వరకూ చేరుకునే వీలుంటుంది. తేజ్‌పూర్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది వెడల్పు దాదాపు 12కి.మీ ఉంటుంది, కాబట్టి సొరంగాన్ని తేజ్‌పూర్ జిల్లాలో నిర్మించనున్నారు.

More Telugu News