Yamini Sadineni: మీ ఇంటికి టు-లెట్ బోర్డు పెట్టుకోండి, ఏదైనా ఐటీ కంపెనీ రెంట్ కు తీసుకుంటుంది: జగన్ కు యామిని సలహా

  • వర్మ ఓ సైకో
  • అతడికి సపోర్ట్ చేసి జగన్ తనలోని సైకోని బయటపెట్టుకున్నారు
  • వర్మకు మద్దతుగా ట్వీట్ చేయడంపై మండిపడిన యామిని

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మద్దతుగా వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేయడాన్ని టీడీపీ మహిళా నేత యామిని సాధినేని విమర్శించారు. మీకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టవు, ఎవరో ఒక సైకో దర్శకుడు బాధపడ్డాడని అతడికి సపోర్ట్ చేసిన మీకు ఇక్కడ ఉండే అర్హతలేదంటూ యామిని ప్రతిపక్షనేతపై మండిపడ్డారు.

 "మీరు ఐదేళ్లుగా పొరుగురాష్ట్రంలో కూర్చుని ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు దానికి టు-లెట్ బోర్డు పెట్టుకుంటే మంచిది. ఏదైనా ఐటీ కంపెనీ దాన్ని రెంట్ కు తీసుకుని మీకు అద్దె చెల్లిస్తుంది. అయినా మీరు ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంలోనే ఉన్నారు. ఇక మే23 తర్వాత మీరు శాశ్వతంగా అక్కడే ఉండొచ్చు. ఆంధ్ర రాష్ట్రానికి టూరిస్టులాగా మారిపోతారు. అద్దె రూపంలో అయినా కాస్త సొమ్ము వస్తుంది. మీరు సంపాదించిన పాపపు సొమ్మును ఏదైనా అనాథ శరణాలయాలకు ఇచ్చేయండి, వచ్చే జన్మలో అయినా మీరు సీఎం అవ్వాలన్న కోరిక నెరవేరుతుందేమో!" అంటూ హితవు పలికారు.

అంతకుముందు ఆమె వర్మ, జగన్ లను కలిపి ఉతికారేశారు. వర్మ ఓ సైకో అని, అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయడం ద్వారా జగన్ తనలో ఉన్న సైకోని బయటపెట్టుకున్నాడంటూ యామిని వ్యాఖ్యానించారు.

"పొరుగు రాష్ట్రంలో అభంశుభం తెలియని ఇంటర్ విద్యార్థులు చనిపోతే కూడా అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జగన్ కు నోరు రాలేదు. కనీసం ఓ ట్వీట్ చేయడానికి మనసు రాలేదు. ఓ సైకో డైరక్టర్ చంద్రబాబునాయుడి గారి ప్రతిష్ఠను దిగజార్చడానికి ఓ పనికిమాలిన సినిమా తీశాడు. దానికోసం ఇక్కడికి వచ్చి తన సైకోయిజాన్నంతా చూపిస్తూ పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటే జగన్ దాన్ని మాత్రం ట్వీట్ చేస్తారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ బాధ పడుతుంటే జగన్ చూడలేకపోతున్నారు. వర్మ బాధపడడం జగన్ కు ప్రాధాన్యత అంశంగా మారింది. అందుకే దానిపై ట్వీట్ కూడా చేశారు"  అంటూ విమర్శించారు.

More Telugu News