indian prisoners: 60 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసిన పాకిస్థాన్

  • విడుదలైన వారిలో 55 మంది మత్స్యకారులు
  • మిగిలిన వారు సరైన వీసా, డాక్యుమెంటేషన్ లేనివారు
  • ఈ నెలలో 360 మందిని విడుదల చేసిన పాక్

పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న 60 మంది భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. మానవతా దృక్పథం, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పే క్రమంలో పాక్ ప్రభుత్వం 60 మంది భారత ఖైదీలను విడుదల చేసింది. వీరిలో 55 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరందరిని వాఘా సరిహద్దు వద్ద వదిలి పెట్టారు. సముద్రంలో చేపలు పడుతూ పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లడంతో మత్స్యకారులను అరెస్ట్ చేశారు. మిగిలిన ఐదుగురుని పాకిస్థాన్ లోనే అరెస్ట్ చేశారు. సరైన వీసా, డాక్యుమెంటేషన్ లేని కారణంగా అదుపులోకి తీసుకున్నారు.

ఈరోజు విడుదలైనవారంతా తమ శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నవారే. వీరిలో కొందరు శిక్షాకాలం కంటే ఎక్కువగానే జైలు జీవితాన్ని గడిపారు. ఈ సందర్భంగా షోయబ్ అనే వ్యక్తి మాట్లాడుతూ, డబ్బ సంపాదన కోసం తాను పాకిస్థాన్ వెళ్లానని, అయితే ఒక చెడు సంస్థ చేతిలో పడ్డానని వాపోయాడు. తనకు 3 నెలల జైలు శిక్ష పడిందని... కానీ, 18 నెలలు జైలు జీవితాన్ని గడిపానని చెప్పారు.

వాహిద్ ఖాన్ అనే వ్యక్తి మాట్లాడుతూ, పాకిస్థాన్ లో తన వీసా పోగొట్టుకున్నానని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, 20 నెలలు జైల్లో ఉంచారని తెలిపాడు. స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు.

జైలు శిక్షను పూర్తి చేసుకున్న భారతీయులను స్వదేశానికి తిరిగి పంపాలంటూ ఏప్రిల్ 9న పాకిస్థాన్ ను భారత్ కోరింది. వెంటనే స్పందించిన పాకిస్థాన్ ఏప్రిల్ 14 వరకు 300 మంది భారత ఖైదీలను విడుదల చేసింది. ఈరోజు మరో 60 మందికి స్వేచ్ఛను ప్రసాదించింది.

More Telugu News