Dog: బీజేపీకి ప్రచారం చేస్తోందట... శునకాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు!

  • మహారాష్ట్రలో శునక ప్రచారం
  • పోలీసులను ఆశ్రయించిన మిగతా పార్టీలు
  • శునకం యజమానిపైనా కేసు

పోలింగ్ కు రెండు రోజుల ముందు ప్రచారం ముగుస్తుందన్న సంగతి తెలిసిందే. ఆపై ఎవరు ప్రచారం చేసినా చర్యలు తప్పవు. అటువంటిది ఓ వైపు పోలింగ్ జరుగుతూ ఉంటే, బీజేపీకి ఓటేయాలంటూ వీధుల్లో ప్రచారం చేస్తే ఊరుకుంటారా? ఈసీ నిబంధనలను అమలు చేసే విషయంలో తమకు మనుషులైనా, జంతువులైనా ఒకటేనని నిరూపించారు మహారాష్ట్ర పోలీసులు. బీజేపీకి ప్రచారం చేస్తోందన్న ఆరోపణలపై ఓ శునకాన్ని అరెస్ట్ చేసిన ఘటన నందుర్భార్ లో జరిగింది.

 ఏక్ నాథ్ మౌతీరాం అనే వ్యక్తి, తన పెంపుడు కుక్కపై బీజేపీ అనుకూల స్టిక్కర్లను అతికించి, పోలింగ్ రోజు దాన్ని బయటకు తీసుకువచ్చాడు. "మోదీకి ఓటేయండి, దేశాన్ని కాపాడండి" అన్న నినాదాన్ని కూడా దాని ఒంటిపై రాశాడు. ఇక రోడ్డుపై కుక్క ప్రచారాన్ని చూసిన ఇతర పార్టీల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఆయన చర్యలు ఉన్నాయని తేల్చిన పోలీసులు ఏక్ నాథ్ పై కేసు పెట్టి, ఆ కుక్కను కూడా స్టేషన్ కు తరలించారు. దాని ఆలనా, పాలనా తాము చూడలేమని, వెంటనే ఈ శునకాన్ని తీసుకెళ్లాలని మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బందికి పోలీసులు సూచించారు.

More Telugu News