TMC: గొడవలు కామనే కదా.. అయినా నేను ఆలస్యంగా నిద్రలేచా: టీఎంసీ అభ్యర్థి మూన్‌మూన్ సేన్

  • బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
  • పోలింగ్ కేంద్రాల వద్ద టీఎంసీ-బీజేపీ కార్యకర్తల బాహాబాహీ
  • భారత్ ప్రజాస్వామ్య దేశమని చెప్పడానికి సిగ్గుగా ఉందన్న మూన్ మూన్ 

నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌లో జరిగిన గొడవపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మూన్‌మూన్ సేన్ స్పందిస్తూ.. ఆ గొడవల గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. తాను ఆలస్యంగా నిద్ర లేచానని, కాబట్టి అక్కడ గొడవ జరిగిన విషయం తనకు తెలియదని అన్నారు. అయినా, రాజకీయ పార్టీలన్నాక గొడవలు సహజమేనని, బెంగాల్‌లో జరిగిన వాటిని మాత్రమే ప్రస్తావించడం సరికాదని అన్నారు.

ఓటర్లను తమకు నచ్చిన పార్టీకి ఓటెయ్యకుండా బలవంతంగా ఓట్లు వేయిస్తున్నారని, దేశంలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పడానికి తనకు సిగ్గుగా ఉందని మూన్‌మూన్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేత బాబుల్ సుప్రియో కారును ధ్వంసం చేసిన విషయం గురించి విలేకరులు ఆమెను స్పందించమని కోరగా.. ఆయన పేరును తన వద్ద ప్రస్తావించవద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాగా, నాలుగో విడత ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది.

More Telugu News