India: అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాలను విధిస్తోంది.. మరోసారి అక్కసును వెళ్లగక్కిన ట్రంప్!

  • ఇప్పటికే వందలకోట్ల డాలర్లు కోల్పోయాం
  • ఇకపై అలా జరగబోదు.. కొత్త ఒప్పందం తెస్తాం
  • విస్కాన్సిన్ ర్యాలీలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై తన అక్కసును వెళ్లగక్కారు. అమెరికా ఎగుమతి చేస్తున్న వస్తువులపై ఇండియా భారీగా సుంకాలు విధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ భారత ఉత్పత్తులపై మాత్రం అమెరికా ఎలాంటి సుంకాలు విధించడం లేదని గుర్తుచేశారు. భారత్ తో పాటు జపాన్, చైనా, వియత్నాం అమెరికాను దోచుకుంటున్నాయని ఆరోపించారు. అమెరికా ఉత్పత్తులు, అమెరికన్లకే తొలి ప్రాధాన్యత ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం గ్రీన్ బే నగరంలో జరిగిన రిపబ్లికన్ ర్యాలీకి ట్రంప్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ..‘అమెరికా నుంచి ప్రపంచదేశాలన్నీ కొన్ని సంవత్సరాలుగా దోచుకుంటూ ఉన్నాయి. భారత్ మన ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధిస్తోంది. దీనివల్ల కొన్ని దశాబ్దాలుగా వందల కోట్ల డాలర్లను మనం నష్టపోయాం. అలాగే చైనా, జపాన్, వియత్నాం కూడా భారీగా పన్నులు వడ్డిస్తున్నాయి. అమెరికా కాగితపు ఉత్పత్తులను కూడా ఈ దేశాలు విడిచిపెట్టడం లేదు.

కానీ ఇకపై అది జరగబోదు. ఈ దేశాలతో మనం కొత్త వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నాం. దీనికి ప్రతినిధుల సభ ఆమోదం తెలుపుతుందని నమ్ముతున్నా’ అని తెలిపారు. అమెరికాకు చెందిన హార్లే డేవిడ్ సన్ బైక్ పై భారత్ 100 శాతం సుంకం విధిస్తుండగా ట్రంప్ విజ్ఞప్తి నేపథ్యంలో సుంకాలను 50 శాతానికి తగ్గించింది.

More Telugu News