Smart Phone: శాంసంగ్ ఫోన్ ఆర్డర్ చేస్తే బండరాయి వచ్చింది!

  • వరంగల్ జిల్లా గీసుకొండలో ఘటన
  • రూ. 10,999 పెట్టి స్మార్ట్ ఫోన్ కొన్న నర్సింగరావు
  • బాక్స్ లో బండరాయి కనిపించడంతో అవాక్కు

ఆన్ లైన్ కొనుగోళ్లతో అప్పుడప్పుడు నష్టపోయే అవకాశం వుందని మరోసారి రుజువైంది. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండలో జరిగిన ఓ ఘటనలో సెల్ ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తికి బండరాయి వచ్చింది. బాధితుడు పల్లెపాటి నర్సింగరావు కథనం ప్రకారం, ఈజీఎస్ లో క్షేత్ర సహాయకుడిగా పనిచేస్తున్న ఆయన నాలుగు రోజుల క్రితం రూ. 10,999 విలువైన శాంసంగ్ ఫోన్ ను ఆన్ లైన్ సంస్థలో ఆర్డర్ ఇచ్చాడు. నిన్న సంస్థ ప్రతినిధి వచ్చి, సెల్ ఫోన్ వచ్చిందని చెప్పడంతో, అతనికి రూ. 11 వేలు ఇచ్చి ఫోన్ తీసుకున్నాడు. అప్పటికే నర్సింగ్ రావుకు అనుమానం వచ్చి, గ్రామస్థుల ముందు వీడియో తీస్తూ, పార్శిల్ ను విప్పాడు. శాంసంగ్ గెలాక్సీ బాక్స్ అయితే కనిపించిందిగానీ, దాన్ని తెరిచి చూస్తే 300 గ్రాముల బరువున్న బండరాయి కనిపించింది. బాక్స్ ను తెచ్చిచ్చిన వ్యక్తిని ప్రశ్నించగా, తనకేమీ సంబంధం లేదని సమాధానం ఇవ్వడంతో, అతన్ని పోలీసులకు అప్పగించిన నర్సింగరావు, తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

More Telugu News