UAE: చట్టాలను దాటిన మానవత్వం... యూఏఈలో తొలిసారి హిందూ, ముస్లిం దంపతుల బిడ్డకు బర్త్ సర్టిఫికెట్!

  • ముస్లిమేతరుడిని పెళ్లాడిన ముస్లిం మహిళ
  • చట్టాలు అనుమతించకపోవడంతో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వని అధికారులు
  • మానవతా దృక్పథంతో పరిశీలించి అనుమతించిన కోర్టు

కఠిన చట్టాలను మానవత్వం అధిగమించింది. నిబంధనలను పక్కనబెట్టి, ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతికి పుట్టిన చిన్నారికి బర్త్ సర్టిఫికెట్ లభించేలా చేసింది. యూఏఈ దేశ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళితే, యూఏఈ చట్టాల ప్రకారం, ముస్లిం మతస్తుడు ముస్లిమేతర మహిళను పెళ్లి చేసుకోవచ్చు కానీ, ముస్లిం మహిళ ముస్లిమేతరుడిని వివాహం చేసుకునేందుకు వీలుండదు.

అయితే, ఇండియాకు చెందిన కిరణ్ బాబు, సన్ సాబూలు 2016లో కేరళలో వివాహం చేసుకుని, షార్జాలో నివాసం ఉంటున్నారు. వారికి గత సంవత్సరం జూలైలో కుమార్తె జన్మించగా, అనామ్తా ఏస్ లిన్ కిరణ్ అని పేరు పెట్టుకున్నారు. చట్టాల కారణంగా పాపకు జన్మ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు అధికారులు అంగీకరించలేదు. ఈ దంపతులు కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఇక వారు ఇండియాకు వెళ్లేందుకు చూడగా, పాపకు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ లభించలేదు. దీంతో కిరణ్ మరోమారు కోర్టును ఆశ్రయించగా, మానవతా దృక్పథంతో బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అనుమతిస్తున్నామని కోర్టు పేర్కొంది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

More Telugu News