Vishal: హీరో విశాల్ కు ఘోర అవమానం... నిర్మాతల మండలి పర్యవేక్షణ బాధ్యతలు ఎన్. శేఖర్ కు అప్పగించిన ప్రభుత్వం

  • మండలి కార్యకలాపాల్లో పారదర్శకత లేదని భావించిన ప్రభుత్వం
  • ఏ నిర్ణయం తీసుకోవాలన్నా శేఖర్ ద్వారానే అంటూ స్పష్టీకరణ
  • ఖర్చులపై లెక్కలు చెప్పడంలేదని విశాల్ పై సభ్యుల ఆగ్రహం

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోగా వెలుగొందుతున్న విశాల్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సినిమాల సంగతి ఫర్వాలేదు కానీ, పరిశ్రమకు చెందని రాజకీయాల్లో మాత్రం విశాల్ కు ఏదీ కలిసిరావడంలేదు. కొంతకాలం క్రితం నడిగర్ సంఘం వివాదాల్లోనూ విశాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా, ఆయనకు అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న తమిళ నిర్మాతల మండలిని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ఇకమీదట నిర్మాతల మండలి కార్యకలాపాలను ఎన్.శేఖర్ పర్యవేక్షిస్తారంటూ తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.

విశాల్ అధ్యక్షుడిగా ఉన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో  కొంతకాలం కిందట  రూ.7 కోట్లు ఖర్చు చేశారని, దీనికి సరైన లెక్కలు చూపడంలేదని మండలిలో సభ్యులే ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. ఓ దశలో విశాల్ ను కార్యాలయంలోకి రానివ్వకుండా సభ్యులు ఆఫీసుకు తాళం వేశారు. దాంతో, పోలీసు కేసులు, కోర్టు విచారణలతో వ్యవహారం బజారుకెక్కింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

విశాల్ కార్యవర్గానికి ఇక ఎంత మాత్రం అధికారం లేదని, నిర్మాతల మండలికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తాము నియమించిన ఎన్.శేఖర్ ద్వారానే తీసుకోవాలని స్పష్టం చేసింది. తద్వారా విశాల్ పై సభ్యులు చేస్తున్న ఆరోపణలు నిజమే అని ప్రభుత్వం గుర్తించినట్టయింది.

More Telugu News