పోలవరం ప్రాజెక్టు దగ్గర రోడ్డుకు మళ్లీ పగుళ్లు.. ఐఐటీ నిపుణులతో కమిటీ వేసిన ఏపీ ప్రభుత్వం!

28-04-2019 Sun 15:20
  • నిన్న రోడ్డుపై భారీ పగుళ్లు
  • ఘటనాస్థలికి మంత్రి దేవినేని ఉమ
  • నివేదిక ఆధారంగా చర్యలు తీసుంటామన్న ఏపీ మంత్రి
పోలవరం డ్యామ్ వద్ద రోడ్డుకు నిన్న భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ పగుళ్లపై ఐఐటీ నిపుణులతో కమిటీ వేశామని ఉమ తెలిపారు. కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్‌కు అనుగుణంగా జలవనరుల శాఖ అధికారులు ఇక్కడ పని చేస్తున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 23 తర్వాత వైసీపీ దుకాణం బంద్ అవుతుందని జోస్యం చెప్పారు. గతంలోనూ పలుమార్లు ప్రాజెక్టు వద్ద వేసిన రోడ్లకు భారీ పగుళ్లు వచ్చాయి. కొన్ని చోట్ల రోడ్లు కుంగిపోయాయి. అయితే మట్టిలో తేమశాతం తగ్గిపోవడంతోనే ఇలా పగుళ్లు వస్తున్నాయని ఇంజనీరింగ్ అధికారులు అప్పట్లో చెప్పారు.